Pages

Friday, 12 April 2013

నేను మీలాంటి వాడినే



                      నేను మీలాంటి వాడినే   
                                                          (వ్యాసం) 

ఆంగ్ల సంస్కృతి, భాష మన నర నరాల్లో జీర్ణించుకు పోయింది ఎంతగా అంటే "మనం ఇంగ్లీష్ మాట్లాడుతున్నామా తెలుగు మాట్లాడుతున్నామా" అన్నంతగా , మనం మాట్లాడేటప్పుడు ఎన్నో పదాలు ఆంగ్లంవే దొర్లుతుంటాయి . ఎవరో ఎందుకో నా విషయమే తీసుకోండి మాట్లాడేటప్పుడు ఆంగ్ల పదాలు దొర్లకుండా ఉండటానికి నేనే
 అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. చాలా  మంది ఫోన్ చెయ్యగానే లేదా చాటింగ్ మొదలు పెట్టగానే  "గుడ్ మార్నింగ్" అని చెప్పటం అతి సర్వ సాధారణం నేను "శుభోదయం" అని చెప్పటం బలవంతంగా అలవాటు చేసుకున్నాను అటునుండి చిన్న వెటకారపు నవ్వు కొంతమంది నుండి అప్పుడప్పుడు ఎదురవుతూనే వుంటుంది . "ఊరందరిది ఒకదారి ఉలిపిరి పిట్టది ఒకదారి" అన్నట్లు మరి నవ్వరా? వోణి వేసుకొనే అమ్మయిలాగే ఇది కూడా ఒక ప్రత్యేకత .

ఒకప్పుడు పంజాబీ డ్రెస్ వేసుకొనే అమ్మాయిల్ని ప్రత్యేకంగా
  చూసేవాళ్ళం ఆ తరువాత జీన్స్ ఇప్పుడు లంగా వోణి వేసుకొనే అమ్మాయిల్ని ప్రత్యేకంగా చూస్తున్నాము .  అలాగే నా బోటి వాళ్ళు తెగించి "శుభోదయం" అన్నా కూడా అటునుండి " మరీ ఇంత ఛాందసమా?"   అనే చిన్న నవ్వు వారి సంభాషణలో వినిపిస్తుంది  . కొన్ని అలవాట్లు క్రమేపి దూరం చేసుకోవాలి అనిపిస్తుంది.  జన్మ దినం రోజు "కేకు కటింగ్" మొన్నటివరకు అయిష్టంగానే మా పిల్లలచే చేయించేవాళ్ళం .  ఈ విషయంలో పిల్లల్ని ఒప్పించటం చాలా కష్టం ఎందుకంటే వారి తోటి పిల్లలు కేకులు కట్ చేస్తే వీరిని చెయ్యొద్దు అంటే ఏదో బ్రహ్మాండం బద్దలై పోదు? మావాడు అయితే ఏకం నేల మీద పడి  దొర్లి ఏడ్చేవాడు కాని మొన్న పుట్టిన రోజుకి ఇంకో "ఎర" చూపి కేకు నుండి వాడి ద్రుష్టి మరల్చగలిగాము .  మొన్న ఫెసుబుక్ లో  పోస్ట్ చూసాకా ఇంకా కేకు కటింగ్ వద్దని అనుకున్నాము.

 మొన్న మా వాడి పుట్టిన రోజు..??  చూసారా??  అప్రయత్నంగా నా వ్రేళ్ళు "బర్త్ డే" అని టైపు చెయ్యబోయాయి కాని వద్దని నా మనసు వాటిని వారించింది. చెయ్యగా  చెయ్యగా అదే అలవాటు అవుతుంది.  ఈ మద్య నా నోటికి,  నా మనసుకి,  నా వ్రేళ్ళు కి ఈ సంఘర్షణ మాములు అయిపొయింది . "మనిషి నిరంతరం ఒక విద్యార్ధి" నేర్చుకుంటూనే వుండాలి "ఒక మంచి మార్పు వైపు మనం అడుగు వేస్తున్నపుడు వెటకారాలు హేళనలు మాములే అలా అని మనం మనం మంచి పనులు చెయ్యటం ఆపకూడదు". " మనం వంద వంతులు ప్రయిత్నం చేస్తే కనీసం ఒక్క వంతు అయినా మార్పు సాధ్యం అవుతుంది"  ఎవరిలోనో ఎందుకు కనీసం మనలో అయినా ఆ మార్పు వచ్చినా చాలు . " మనలో మార్పు రావాలి అన్న ఆలోచన కూడా ఒక మార్పే"  ఈ రోజు కాకపోతే రేపైనా మారే అవకాశం వుంది కాని ఎవ్వరం వంద శాతం మారలేము మార్చలేము ఆ ఒక్క శాతం మారినా చాలు అది రేపు రెండు శాతం ఆవలనాడు మూడు శాతం అవుతుంది .

ఇంక పిల్లలు కూడా అంతేనండి
  మనల్ని చూసే వారు నేర్చుకుంటారు తెలుగు నేర్చుకోమని పోరు పెడుతుంటే మా పిల్లలు ఇప్పటికి నేర్చుకోవటం మొదలు పెట్టారు కనీసం వాళ్ళ బుర్రలో తెలుగు చదవకపోవటం ఒక నేరం అనే భావన అయినా మేము కల్పించాము .  ఆ విషయంలో మనమే ముందు మారి,  వారికి దారి చూపించాలి . పిల్లలు మన సాంప్రదాయాల గొప్పతనం కోసం చెప్తే తప్పకుండా వింటారు అలా కాకుండా  ముందే "ఆ ...మన మాట వింటారా?"  అనే ఒక వ్యతిరేక భావన మనలోనే వుంటే వారిలో ఎప్పటికి మార్పు రాదు . "ప్రయిత్నం చెయ్యటమే మన విధి అదే మనకు భవిష్యత్ లో నిధి" . అలా అని నేను పూర్తిగా అచ్చమైన స్వచ్చమైన తెలుగు వాడిగా మారిపోయానని అనుకోవద్దు "నేను మీలాంటి వాడినే"  కాకపోతే మార్పు కోసం అను క్షణం ప్రయిత్నం చేస్తున్నాను నా మనసు అనుక్షణం సంఘర్షణకి లోనవుతూనే వుంది .

చివరగా చెప్పేదేంటంటే మార్పు అనేది నాలోగాని మీలో గాని ఒక్క రాత్రి రాత్రే రాదు అది నిరంతర సాధన మాత్రమే ఇలా సాధన చేస్తే కనీసం ఒక పదేళ్ళ తరువాత అయినా మనలో మార్పు వస్తుందని ఆశిద్దాం
 .


మీగడ త్రినాధ రావు
కార్య నిర్వాహకులు
మన తెలుగు మన సంస్కృతి (ఫెసుబుక్ గ్రూప్)

No comments:

Post a Comment