Pages

Monday 20 May 2013

అభిమాని



అభిమాని

అభిమానీ
  ఓ అభిమానీ .. 
అదిగదిగో నీ హీరో అయ్యాడు జీరో
మార్పులని చేర్పులని నిన్ను వంచించి
తానే మారియిపోయాడొక హీరో
 
పంచెలూడతీస్తానని తీయించుకున్నాడొక
  హీరో 
వట్టి
  తుపాకినే కాదు గట్టి తుపాకీ పట్టి
గుండెల్లో గుళ్ళను దించాడొక హీరో
  
అంగ బలం చూసుకొని అయ్య బలం చూసుకొని
మంది మార్బలమెట్టి మట్టు పెట్టాడొక హీరో
 
లవర్ భాయ్ ఒకరు నవ మన్మదుడొకరు
 
క్లుబ్బులని పబ్బులని బారూలని బీరులని
తిరిగే వాడేనా
  నీ హీరో 
నిన్ను నన్ను వేరుచేసి చిచ్చు పెట్టి చిందులేసి
వారు వారు రాసుకు
  పూసుకు  తిరిగే వారా నీ హీరో 
బాబుల అండ చూసి తెగబలసిన బాబులు
నీ తల్లి మాట తిప్పి కొట్టి
  తండ్రి మాట తగలేసి 
రాత్రనక పగలనక
   పడి పడి  పరుగెడతావెందుకు
కోట్లు కూడబెడితే నువ్వు కాలుదువ్వతావెందుకు
 
చప్పట్లు కొట్టి జేజేలు కొట్టి
  కడతేరిన నీకు
వాడిచ్చిన లకారాలు మరలా
 ఇస్తుందా  నీ వంటి పుత్రుని 
ఎందుకు ఎందుకు
వాడి
  వంకర పనులును వెనకేసుకోస్తావెందుకు 
దేశమంటే మనుషులని అన్నాడొక హీరో
సత్యమే నిత్యమని చాటిందొక హీరో
తెల్లవాడి నెదిరించి తెగల కోసం తనువుచాలించా డొక హీరో
శాంతికోసం స్వార్ధం వీడాడొకహీరో
 
తెలుగు జాతి వెలుగు కోసం డిల్లీ డేగలును డీకోట్టాడోక హీరో
 
సంఘ
 సంస్కరణ హీరో సంస్కార హీరో
వీరందరినీ మరిచి వాడికి ఊడిగం చేస్తావెందుకు
 
నిజ జీవిత నాయకులును కాదని
ఉత్తిత్తి నాయకుడికి ఊడిగం
  చేస్తావెందుకు
పట్టం కడతావెందుకు పండగ చేస్తావెందుకు
 
అభిమానీ ...
  ఓ...  అభిమానీ...   


మీగడ త్రినాధ రావు

Tuesday 30 April 2013

****మేడే నాటి ముభారకులు ****

****మేడే  నాటి ముభారకులు ****

నాగలి పట్టే నాగన్న రెక్కలు తెగిన రైతన్న
సమ్మెట పట్టే సూరన్న సన్నాయి మేళం సంగన్న
మీసం మెలిలో
  మగ్గిపోతున్న మంగలి సత్తెన్న 
మురికి బట్టలు చుట్టి మూటను కట్టే చాకలి చిమ్మన్న

రెక్కలు
 ముక్కలు చేసి రంగుల చీరలు నేసే దేవాంగి దానయ్య
కండలు కరిగించే కంసాలి కామయ్య
కంపును ఇంపుగా మోసే పాకీ పాపమ్మ
కావడి కుండలు మోసే కుమ్మరి కూనయ్య

బుగ్గిలో మగ్గి బుట్టలు తట్టలు అల్లే మేదరి ముసలయ్య
బుగ్గలు బుగ్గి అయ్యేదాకా శంకం ఊదే జంగాల సాంబయ్య
ఆకాశం నుండి అమృతం దించి ఆగమైపొతున్న గౌన్ల గురయ్య
అప్పడాలు అద్ది అంగట్లో అమ్మే కోమటోల కనకమ్మ

డప్పులుకొట్టి
 దండోరా  వేసే మాలోల ముత్తయ్య
చెమటలు పట్టి
 చెప్పులు కుట్టే మాదిగ మల్లయ్య
చెత్తను చెరిపేసి చిత్రం గీసేసిన
 శుబ్బరాలు చుక్కమ్మ  
నెత్తుటి చుక్కలు చిమ్మి
 బండలు పిండి చేసే పటానయ్య 

మండే ఎండలతో ఎండే గుండెలతో
 
కాయా కష్టంతో వచ్చిన నష్టంతో కనుమరుగౌతున్న
 
కార్మిక
  కర్తలకు కాలే కడుపులకు కర్షక జీవులకు
మేడే
  నాటి ముభారకులు


                                                                మీగడ త్రినాధ రావు 







Monday 29 April 2013

ఒక్కసారి చెప్పండి మీ జేజేలు...http://telugu.greatandhra.com/politics/april2013/26c_one_time.php

ఒక్కసారి చెప్పండి  మీ జేజేలు

ప్రజా సంక్షేమం చూడాల్సిన ప్రభుత్వాలు ధనార్జనే ధ్యేయంగా ప్రజా శ్రేయస్సును గాలికి వదిలేస్తున్నాయి. ఈ రోజు మంచినీళ్ళు దొరకని ఊళ్ళు చాలా వున్నాయి కాని మద్యం దొరకని వూరంటూ వుండదు. పల్లె పల్లెకు  అర్దరాత్రి అపరాత్రి అనకుండా మద్యం విక్రయిస్తున్నాయి. మరోప్రక్క అడుగడుక్కి నోట్లో గొట్టాలు పెట్టి పోలిసుల  చేత తనికీలు నిర్వహిస్తుంది . వాళ్ళ దృష్టిలో ఇంటికెళ్ళి త్రాగండి బాబులు అని అర్ధం కావచ్చు అలా అయితే బార్లుకు బార్లా తెరిచి ఇబ్బడి ముమ్మడిగా లైసెన్సులు ఎందుకు ఇస్తున్నట్లు ?  మరి "బార్లా తెరచిన బార్లలో" తాగిన వాడు రోడ్డు ఎక్కక ఉదయం వరకు అక్కడే పవలిస్తాడా ? ఇంటికెళ్ళి నీట్ గా తయారయ్యి ఫ్రీజర్ లో పెట్టుకొని సోడా పోసుకొని త్రాగటానికి వాళ్ళుకి కుదురుతుందా ? అంత నిలకడ తనం రెక్కలు ముక్కలు చేసుకున్న ఆ  బడుగు జీవులుకు ఎక్కడ వుంటుంది ?

ఈ మద్య జరుగుతున్న చాలా అత్యాచారాలకి రాత్రి పూట పూటుగా మద్యం సేవించి కన్ను మిన్ను కానకుండా యువతుల్ని ఏడిపించి వారితో తోడుగా
 వున్న భర్తల్ని ,అమ్మల్ని , అన్నల్ని,  స్నేహితులని చావ బాది వాళ్ళ ముందే కిరాతకంగా అత్యాచారం చేస్తున్నారు. లేదంటే ఏ లారీ కిందకో బస్సు క్రిందకో తోసేస్తున్నారు . మద్యం మైకంతో  ఇంటికొచ్చిన కొంతమంది తాగుబోతులు  వావి వరుసలు చూడకుండా  కూతురనక,  చెల్లి అనక, పసిపిల్లలనక  అత్యాచారం చేస్తున్నారు. రోజుకు నాలుగు వందలు సంపాదిస్తే మూడువందల మద్యం త్రాగి వందో యాబయ్యో భార్యకు ముస్టివేసి పిల్లలని మల మాలా మాడుస్తున్నారు  మరికొంతమంది బడుగుజీవులు .

ఒక ప్రక్క "మద్యం త్రాగితే ఆరోగ్యానికి హానికరం" అంటూనే బాగా మద్య త్రాగండి , అర్దరాత్రి అపరాత్రి అనకుండా తిరగండి , ఇల్లు ఒళ్ళు గుళ్ళ
  చేసుకోండి అని ప్రభుత్వమే పరోక్షంగా ప్రోత్సహిస్తుంది. ఎన్టీఆర్ పుణ్యామా అని మద్య నిషేధం వచ్చినా కూడా ఎన్నో రోజులు అమలుకు నోచుకోలేదు.  ఆ తరువాత వచ్చిన చంద్రన్న నెమ్మదిగా మద్య నిషేదాన్ని అటకెక్కించి ఇప్పుడు నీతి సూత్రాలు వల్లి వేస్తున్నారు , ఆ తరువాత రాజన్న వచ్చి ఎక్కడో పట్టణంలోనే దొరికే మద్యం సీసాని పల్లె పల్లె కి అందించి అభివృద్ధి బాట పట్టించారు. ఆ తరువాత వచ్చిన  రోసన్న , కిరణనన్నలు కూడా  ఆ అభివృద్దిని అలాగే కొనసాగిస్తూ రాష్ట్రాన్ని "మద్యాంద్ర ప్రదేశ్" గా మార్చి ప్రజల ఋణం తీర్చుకుంటున్నారు .

కనుక బలిఅవుతున్న బడుగులారా
చితికి పోతున్న చెల్లులారా
అందరూ ఒకసారి చెప్పండి ఈ అన్నలందరికీ మీ జేజేలు.


మీగడ త్రినాధ రావు

సంపూర్ణ ఆరోగ్యం..."విశాఖ సంస్కృతి " మాస పత్రిక ఏప్రిల్ 2013

 

  సంపూర్ణ ఆరోగ్యం

ఆరోగ్యం అంటే ఒక్క శారీరక ఆరోగ్యమే అనే భావం మనలో చాలా మందిలో పాతుకుపోయి వుంటుంది.  శారీరకంగాను, మానసికంగాను దృడంగా  వున్నప్పుడే మాత్రమే అది నిజమయిన  " సంపూర్ణ ఆరోగ్యం"  అవుతుంది . జలుబు , దగ్గు , జ్వరం , తలనొప్పి మొదలగు చిన్న చిన్న జబ్బులనుండి దీర్గకాలిక రోగాలు అయిన రక్త పోటు , మదుమేహం , హృద్రోగం వంటి ఇతరత్రా జబ్బులకి మనం ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకుండా మందులు వేసుకుంటాము . కానీ మనకి ఎన్నో రోగాలకి మూలం మానసిక సమస్యలే కారణం అని  మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు . కేవలం రోగాలకు మాత్రమే మందులు వాడి వాటి కారణమైన మూలాలను మాత్రం పట్టించుకోవటం లేదు. 

కలుపు మొక్క ఒక్కటే పీకేస్తే ఏమౌతుంది మళ్ళీ వేర్లు మొలుస్తాయి . ఆ వేర్లోతోసహా పీకేస్తే సమస్యే వుండదు . మనం అసలు సమస్యను వదిలేసి వ్యాదికి మందు వాడుతుంటాము . అది తాత్కాలిక ఉపసమనం మాత్రమే ఇస్తుంది. వ్యాది మూలాల్ని కనిపెట్టి వాటికి నష్ట నివారణ చర్యలు చేపడితే మనకి సంపూర్ణ ఆరోగ్యం సాద్యమౌతుంది . ఈ యాంత్రిక యుగంలో మనిషి అనేక ఆటుపోట్లకు, ఒత్తిడులకు  గురిఅవుతున్నాడు  ఇంగ్లీష్ వైద్యం పుణ్యామా అని మనకి ఎంత తొందరగా వ్యాదులు తగ్గుతున్నాయో అంతే  తొందరగా మరలా వస్తున్నాయి కానీ వ్యాది మూలాలు పోవటం లేదు .  కొన్ని సస్త్ర చికిత్సలకు ఇంగ్లీష్ వైద్యం తప్పనిసరి అయితే కావచ్చు .  ఇక్కడ యే వైద్యాన్ని చులకన చెయ్యటం కాదు. ఇంగ్లిష్ వైద్యుడు ఉప్పు తగ్గించాలి అంటాడు యెందుకంటే పూర్తిగా మానెయ్యమంటే రోగి ఆ మరునాటి నుండి రావటం మానేస్తారు అని.  ప్రకృతి వైద్యులు మాత్రం శాంతం ఉప్పు మానేయండి అంటారు. కానీ ఇప్పుడు వున్న పరిస్థితుల్లో మనం సాంప్రదాయ ఆయుర్వేదం , ప్రకృతి వైద్యం , హోమియో , యునానీ వంటి సాంప్రదాయ వైద్యానికి ప్రాముఖ్యత ఇవ్వటం మంచిది వీటితో పాటు ముందు మానసిక సమస్యలను తగ్గించు కోవటానికి మొగ్గు చూపాలి .

అభివృద్ది చెందిన దేశాల్లో అయితే ఏ చిన్న మానసిక సమస్యలను వారు నిర్లక్ష్యం చెయ్యరు , వెంటనే మానసిక నిపుణుల సలహాలు పాటిస్తారు . మన దేశంలో ఇంకా ఇది ప్రాచుర్యం పొందలేదనే చెప్పాలి . దీనికి చిన్న విశ్లేషణ వుంది వారి జీవన శైలి వేరు మన జీవన శైలి వేరు అక్కడ కుటుంబ వ్యవస్థ మనంత పటిష్టం కాదు , భార్యా భర్తల సంబందాలులో నిలకడ లేనితనం అనేది  వారి సంతానం మీద, వారి సామజిక వ్యవస్థల మీద ఆరోగ్యం మీద  ప్రభావం చూపించవచ్చు. కానీ మన దేశంలో కూడా ఒకప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు పాచ్యాత్య పోకడలు ఆధునిక నాగరికత పేరుతో ఒక అంటువ్యాదిలా దినదినం అభివృద్ది చెందుతుంది . తద్వారా  మన దేశంలో  క్రమంగా కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. 

మనిషికి మనిషికి దూరం పెరుగుతుంది. బాద చెప్పుకోవాలంటే వినటానికి మనుషులు కరువవుతున్నారు  ఎవరి నడకవారిది , ఎవరి పరుగు వారిది . అంతే కాకుండా మారుతున్న మన జీవన వ్యవస్థ ఆహారపు అలవాట్లు కూడా అనేక రోగాలుకు కారణం అవుతున్నాయి , మరి మన పూర్వీకులుకు లేవా అంటే ఉండేవి కానీ మరి వారి శారీరక శ్రమ అలాంటిది వారి శారీరక శ్రమ వారి జీవన వ్యవస్థ మూలంగా సమస్యలు చాలా వరకు కుటుంబాలు లోనే పరిస్కారం అయ్యేవి .  ఈనాడు నగర సంస్కృతి ఎక్కువైంది  ఇద్దరు పక్కింటివాళ్ళు రోడ్డు మీద కలిస్తే ఎవరో తెలియని పరిస్థితి . అన్ని కృత్రిమ బందాలు , కృత్రిమ స్నేహాలు, కృత్రిమ ఆటలు, కృత్రిమ ఎరువులు, కృత్రిమ మనుషులు, మనసులు ఇలా ఒకటా రెండా "కర్ణుడు చావుకి అన్ని కారణాలే అన్నట్టు" మానసిక సమస్యలకు బోలెడన్ని కారణాలు ముఖ్యంగా మితిమీరిన పోటి తత్వం , ఉరుకులు పరుగుల జీవితం మనిషిని విపరీతమైన ఒత్తిడికి గురి చేస్తున్నాయి . చివరికి పిల్లల స్కూల్స్ చదువులు విషయంలో కూడా మితిమీరిన పోటీ తత్వంతో పెద్దలు పరుగులు పెట్టి పసిపిల్లలని పరుగులు పెట్టించి వారిని తీవ్ర మైన వత్తిడికి గురి చేస్తున్నారు వాళ్ళకి  ఆశక్తి వుందా లేదా చదవగలడా లేదా అని చూడకుండా బలవంతంగా పెద్దలు వారి అభిరుచులును వారిపై రుద్దుతున్నారు ..

ప్రతిరోజు  మనం ఎన్ని వార్తలు చదవటం లేదు?  చిన్న చిన్న కారణలకే ఉసురు తీసుకుంటూ కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు , మరి పూర్వం లేవా సమస్యలు అంటే బోలెడు ఎన్ని సమస్యలున్నా వారి జీవన శైలి మూలంగా దూది పింజేల్లాంటి మేఘల్లా సమస్యలు అలా అలా మాయమయ్యేవి చెప్పేవాళ్ళు వుండేవారు, అమ్మమ్మ , నాన్నమ్మ తాతయ్యల హితబోదలు, నీతికధలు ఉండేవి . బలమైన బందాలు ముందు సమస్యలన్నీ పటాపంచాలయిపోయేవి . ఈ రోజు చాలా మంది అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్యలు ఓల్డ్ ఏజ్ హోం లకే పరిమితం అవుతున్నారు . అత్తవారింటికి వెళ్ళిన కొత్తకోడళ్ళు వేరే గ్రహం మీద కాలుమోపినట్టు బావిస్తున్నారు , ప్రతి చిన్న సమస్యలకు వీదిన పడుతూ విడాకులు తీసుకుంటున్నారు , భార్యా భర్తల్లో పెరుగుతన్న ఆర్దిక సమస్యలు - ఆర్దిక స్వాతంత్ర్యం రెండూ కారణాలే "నువ్వెంత అంటే నువ్వెంత "అనే స్థాయికి వెళుతున్నారు . ఆ మద్య వచ్చిన జగపతిబాబు ప్రియమణి ల "పెళ్ళైన కొత్తలో" అనే సినిమా నేను చెప్పిన ఉదాహరణకి చక్కగా అద్దం పడుతుంది. చూడనివారు డీవీడీ తెచ్చుకొని కొత్తగా పెళ్ళైన వారు తప్పకుండా చూడాల్సిన సినిమా అది .

కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అనేది వారి సంతానానికి తద్వారా చివరికి సమాజ మనుగడనే శాసిస్తుంది. ఇది వాస్తవం. ఇంట్లో భార్యతో గొడవపడి ఒక మనిషి ఆఫీసులో సక్రమంగా మనసుపెట్టి పనిచెయ్యగలడా ? అలాగే ఇంటి ఇల్లాలు కూడా . వారి పిల్లల పెంపకం కూడా అలానే వుంటుంది ఇక్కడ ఇంకో విషయం వర్షం లో తడిసే ప్రతి మనిషికి జ్వరం, జలుబు వస్తుందా వారి వారి వ్యదినిరోడక శక్తినిబట్టి జబ్బులు కూడా . అలాగే కొంత మందికి పుట్టుకతోనే సమస్యలును చాక చక్యంగా ఎదుర్కొనే నైపుణ్యం ఉంటుది కొంతమంది చిన్నచిన్న సమస్యలకే గిల గిల కొట్టుకుంటారు . వారు పెరిగే వాతావరణం పెద్దవాళ్ళ పెంపకం మీద ఆధారపడి వుంటుంది . ఒత్తిడితో కూడిన మనిషి జీవన విదానం అనేక మానసిక సమస్యలకు దారితీస్తుంది , తద్వారా సమాజం మీదకూడా దాని ప్రభావం పడుతుంది అనేది వాస్తవం . ఒక కుటుంబ పెద్ద ఒత్తిడి ఆ కుటుంబం మీద తీవ్ర ప్రభావం చూపెడుతుంది . ఒక కంపనీ అదినేత వత్తిడిలో తీసుకున్న నిర్ణయం కొన్ని వందల ఉద్యోగుల భవిష్యత్ మీద ప్రభావం చూపిస్తింది ఒక దేశాదినేత లేదా ఒక రాష్ట్ర అదినేత వత్తిడిలో తీసుకున్న నిర్ణయాలు మొత్తం ప్రజానీకం మీద పడుతుంది .

 కొన్ని సంవత్సరాల పూర్వం ప్రైవేటు ఎంప్లాయ్ మెంట్ ఎక్స్చేంజి లు కూడా (జాబు కన్సల్టెన్సీ) వస్తున్నాయి అంటే అని వినగానే అదొక విడ్డురం , కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ మెంట్ ఎక్స్చేంజి అంటే నవ్వుతున్నారు (వారి నిర్వాకం కూడా అలానే వుంటుంది మరి ) అలాగే ప్రైవేటు పోస్ట్ ఆఫీసులు (కొరియర్)కూడా ఎప్పుడో వచ్చి చేరాయి మారుతున్న కాలంతోపాటు సేవల్లోకుడా అనేక మార్పులు వచ్చిచేరుతున్నాయి . చిన్నతనం నుండే పిల్లల మానసిక పరివర్తన , వికాసం అనుక్షణం గమనించి అవసరం అయితే వారిని పిల్లల మానసిక నిపుణులు (చైల్డ్ సైక్రాటిస్ట్ )దగ్గరకి అప్పుడప్పుడు తీసుకువెళుతూవుండాలి . అన్నిటికన్నా ముఖ్యం పెళ్ళైన భార్యా భర్తలు తమ వైవాహిక జీవితాన్ని ఎలా పొరపొచ్చాలు లేకుండా నడుపుకోవాలో మానసిక నిపుణులు సలహాలు ద్వారా తెలుసుకోవాలి ." ప్రివెన్సన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ "  అన్నట్లు సమస్య వచ్చిన తరువాత వెళ్ళే కంటే ముందుగానే వెళ్తే చాలా వరకు ప్రయోజనం వుంటుంది. ఇవాళ" ప్రీ మారిటల్ కోన్సుల్లింగ్ " కూడా చేస్తున్నారు అంటే పెళ్లి నిశ్చయమైన వదువరులుకు చేసే కోన్సుల్లింగ్ . అది ఇంకా మంచిది .

ఇవాళ ఎన్నో భార్యా భర్తల సమస్యలు , విద్యార్దుల సమస్యలు ప్రేమ వ్యవహారాలు , ఘోరాలు నేరాలు చూస్తునేవున్నాము వాటికి ప్రధానమైన కారణాలు అవగాహనా రాహిత్యం , మానసిక పరివర్తన లోపించటం . సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే మేల్కుంటే చాలా అనార్దాలకి అడ్డుకట్ట వెయ్యవచ్చు . దీని మీద ఇంకా అవగాహన ప్రజల్లో లేదనే చెప్పాలి , చాలా మంది సమస్య జటిలమైన తరువాతే తమ దగ్గరకు వస్తుంటారని మానసిక నిపుణుల అభిప్ర్రాయం ." మనో వ్యాదికి మందే లేదు" అనేది ఒక ముతక సామెత వ్యాది తీవ్రతనుబట్టి చాలా మందులు వున్నాయి . మందులతో నిమిత్తం లేకుండా కేవలం కోన్సుల్లింగ్ ద్వారా మానసిక సమస్యలను పరిష్కరించే వారిని "సైకాలజిస్ట్ " అని సంబోదిస్తారు. మానసిక వ్యాది మరీ తీవ్రం అయితే వారు మందులు వాడవలసి ఉంటుది అటువంటివారు "సైక్రియాటిస్ట్ " దగ్గర చికిత్స తీసుకోవలసి వుంటుంది , వీరు కోన్సుల్లింగ్ చేస్తూ అవసరం అనుకుంటే మందులు వాడమని చెప్తుంటారు కాని ఆ స్థితికి రాకుండా ఉండటమే మంచిది . వచ్చినా పెద్దగా ఆందోళన చెందనవసరం లేదు .

వీటన్నింటికన్నా ముందు సుఖమైన ఆశావాద జీవితం , సానుకూల దృక్పదం , వ్యాయామం , యోగ విద్య , అట పాటలు , చక్కని సంగీతం , చక్కని ఆహారపు అలవాట్లు. "ఆయనే వుంటే తెల్ల చీరెందుకని " ఒక ముతక సామెత కూడా వుంది . ఇవన్ని మన జీవన విధానం లో లోపించటం మూలంగానే ముందు పేర్కున్న సమస్యలు . సాధ్యమైనంతగా దేశీయ మరియు సాంప్రదాయ వైద్య చికిత్స లైనటువంటి , యోగా, ప్రక్రుతి చికిత్స, ఆయుర్వేదం , హోమియో మొదలగు వాటికి ప్రాదాన్యతనివ్వటం అనేది ఉత్తమం. ఇవన్ని చెప్పినంత సులభం కాకపోయినా కానీ అసాధ్యం మాత్రం కాదు. కృషితో నాస్తి దుర్బిక్షం . సర్వేజన సుఖినో భవంతు .


మీగడ త్రినాధ రావు
మన తెలుగు మన సంస్కృతి
9848826150