Pages

Monday 15 April 2013

|| వసంత వేకువ ||



 || వసంత వేకువ ||

||కొయ్యబారిన కొమ్మల్లో రాలిపోయిన రెమ్మల్లో
ఆకులే అలములై పోతుంటే
సూరీడు మరింత సూటిగా చూస్తుంటే
చిన్న బోయిన చెట్లన్నీచేతలుడిగి పోతుంటే
శిశిరం చిద్విలాసం చిందులు వేస్తుంటే
వసంత వేకువ వెల్లువలా వచ్చి వాలింది.

కోకిలమ్మ కొలువై ప్రకృతిలో నెలవై
కొమ్మ కొమ్మను కదిలించి
రెమ్మ రెమ్మను రెట్టించి బాణీలు ఎన్నో సృష్టించి
సాగే సంగీతం సెలయేరులు తాకి
చిరుగాలిని కలసి పుష్పాలను పలకిరించి
పుప్పొడిని పరికించి
తుమ్మెద నాదంతో జుమ్మని జతకట్టి
ఏటిలోని ఎంకి యెదను తాకింది

తొలికిరణం తాకిన చిగురుటాకు సిగ్గులు
గట్టు మీద గెంతులు గువ్వల గుంపులు
ఎదురులేని ఏరులు ఏరువాక శూరులు
మావిపిందె పూతలు ముసురుకున్న మబ్బులు
ఉదయించిన ఉషస్సులే ఉగాదికి తపస్సులు
ఇది ప్రకృతికే పరవశం జీవకోటి సుకృతం||







చైత్ర మాస వర్ణం

చైత్ర మాస వర్ణం

||పచ్చని ప్రకృతినే పమిటగా చుట్టి
రవికిరణపు రంగుల రవికను కట్టి
రంగవళ్లి అద్దిన వసంత వాకిట్లో
మామిడాకు తోరణాల ముత్యాల ముంగిట్లో
ఉషోదయపు వర్ణ ఉదయకిరణాల సాక్షిగా
లేలేత చిగురుటాకు నీ సిగ్గుల సోయగం
చైత్రమాసపు రమణీయ వర్ణ చిత్రం
మంచు బిందు మల్లి మొగ్గలాంటి నీ ముగ్దమనోహారం
మైమరపిస్తున్న సుమనోహరం

పాడవు పొదుగున లేగదూడ పొసగుదనం
అమ్మతనపు ఆలనకై అలమటించు నీ చక్కదనం
జాలువారిన సిగతో సాంబ్రాణి పొగతో
తడియారని నీ అందాల హరివిల్లు
నాకవుతుంది పన్నీటి చిరుజల్లు

నీ చిలిపి తగవు పోగరుదనం వేప చిగురు వగరుతనం
కనిపించని మమకారం నీ కసురుదనపు కరుకుదనం
నీ అలకల కులుకుతనం మావిపిందె పులుపుదనం
మందహాస మధురిమలే చెరకు ముక్క తియ్యదనం
నువ్వు లేని ఒక్క క్షణం నాకవుతుంది చేదులాంటి ఒక్క నిజం
నువ్వున్న నిండుదనం ఊరించిన ఉప్పదనం
జీవామృత గీతం నువ్వు కూర్చిన కోయిలమ్మ సంగీతం
నీ ఆగమన అనుగ్రహం ప్రణయ ప్రేమపంచాంగం
నీ అందెల సవ్వడులే అలముకున్న ఆమనులై
నీ రాజ్య పూజ్య భావనలో నా అవమానం ఆవిరులై
ఉరికే ఉత్సాహం ఉసిగొల్పే ఉల్లాసం ఈ వన్నెల ఉగాది||