Pages

Monday 29 April 2013

ఏకపక్షం .."విశాఖ సంస్కృతి" మాస పత్రిక మర్చి 2013

     ఏకపక్షం 
ఈ నాటి చర్చలన్నీ ఏకపక్షంగా సాగుతున్నాయి. మహిళలకు అన్యాయం జరుగుతుంది దానికి భాద్యుడు మగవాడే అని ఆడది, కాదు ఆడవాళ్ళ వేష భాషలు కూడా ఒక కారణమే అని మగవాడు ఎవరికి నచ్చినట్లు వారు ఒకరిమీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఏక పక్షంగా మాట్లాడుతున్నారు. ఇలా ఏక పక్ష వాదనలతో సమస్యను మరింత జటిలం చేస్తున్నారు అనిపిస్తుంది. అసలైతే మొన్న డిల్లీ సంఘటన జరిగిన తరువాత ఇంక ఇలాంటి సమస్యలుకి ఒక పరిష్కారం దొరుకబోతుంది ఇక ముందు మగవాడు కొద్దిగా సర్దుకుంటాడు అన్న భావన ప్రతి ఒక్కరిలో వచ్చి ఉండవచ్చు ఎందుకంటె అది సామాన్య ప్రతిస్పందనా? యావత్ భారతావని చిన్నా , పెద్ద, ముసలి, ముతకా అన్న బేదం లేకుండా అందరు కదిలి ఒక మహోద్యమానికి శ్రీకారం చుట్టారు. కాని ఒక ప్రక్క అది కొనసాగుతుండగానే అలాంటి సంఘటనలు పునరావృతం అయ్యాయి. అవుతున్నాయి కూడా. పసి పిల్లలు నుండి ముదుసలి వరకు అత్యాచారానికి గురవుతుంది. దీన్ని బట్టి వీటి మీద విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం వుంది . లోపం ఎక్కడో వుంది దాని గురించి మాములు గల్లీ చర్చలు చాలవు పెద్ద ఎత్తున చర్చలు జరగాల్సిన అవసరం ఎంతయినా వుంది . ఏదో సమస్య వచ్చినపుడు మాత్రమే అతిగా స్పందించి మిగతా వారి విషయాల్లో మిన్నకుండి పోవటం తగదు . ఈ సమాజం మనం నిర్మించుకున్నదే దానికి మూలం వ్యక్తి , వ్యక్తికీ మూలం కుటుంబ వ్యవస్థ , దానికి మూలం స్త్రీ పురుషులిద్దరూ ముఖ్యంగా
  స్త్రీ పాత్ర చాలా కీలకం అని చెప్పవచ్చు .  ఉన్మాదులు, ఉగ్రవాదులు , అవినీతి రాజకీయ నాయకులు , నేరగాళ్లు మొదలగు వారంతా  ఎక్కడినుండి పుడుతున్నారు?  మరి వీళ్ళని కన్నది, పెంచింది ఒక్క మగాడేనా , స్త్రీకి బాగం లేదా కొంత వయసు వచ్చే వరకు వ్యక్తి తల్లి చాటు బిడ్డే కదా . మహనీయులు చాలా మంది తండ్రి కంటే ముఖ్యంగా తల్లి పెంపకం లోనే తయారయ్యారని చరిత్ర చెబుతుంది . శారీరకంగా మగవాడు బలవంతుడు కావచ్చు కాని బుద్దిలో మాత్రం స్త్రీదే పై చేయి "ఇల్లును చూసి ఇల్లాలను చూడమన్నారు " కాని " యజమానిని చూసి ఇల్లును చూడమని మన పెద్దలేం చెప్పలేదు " సృజనాత్మకత మగాడి కంటే స్త్రీకే ఎక్కువ బహుశా అందుకే మోటు  పనులన్నీ మగాడికి అప్పజెప్పి క్రియాశీలక పనులన్నీ స్త్రీలు చెయ్యాలని మన భారతీయ సమాజం లోని పెద్దలు నిర్దేశించారేమో . చాలా మంది తర తరాల నుండి యుగ యుగాల నుండి స్త్రీని మగాడు అణిచి వేస్తున్నాడని అంటుంటారు . ఇందులో పూర్తి నిజం లేదనిపిస్తుంది . మన వేదాలు పురాణాలు ఇతిహాసాల్లో కూడా స్త్రీ కి సమాన ఆధిక్యత , ప్రాముఖ్యత గురించి వుంది . తమ భార్యలను దేవతలా పూచించే మహనీయులు మన చరిత్రలో ఎంతమంది లేరు? భార్య తప్పు చేసినా కళ్ళకు అద్దుకున్న మహనీయులు ఎంత మంది లేరు? ఎందరో మహనీయులు , మహిమాన్వితులు చరిత్రలో వున్నారు మరి వారిని కన్నది ఎవరు? స్త్రీ యే కదా చాలా మంది దుర్మార్గులు వున్నారు మరి వారిని కన్నది కూడా స్త్రీయే కదా . లోపం ఎక్కడ ? మగవాడు సంపాదన చేయటం స్త్రీ ఇల్లు నడపటం . ఇల్లు నడపటంలో ఆడవారికి వున్న  చాకచక్యం, ఓర్పు మగాడికి లేదనే చెప్పాలి " కడివెంత గుమ్మడికాయ కత్తి పీటకు లోకువ " ఎందరో కండలు తిరిగిన మహా యెదులు స్త్రీ ముందు  బలాదూర్ . కొన్ని రాజ్యాలు స్త్రీల మూలంగా జయించిన రాజులూ వున్నారు పోగొట్టుకున్న రాజులూ చరిత్రలో వున్నారు . అంతెందుకు ఈ అఖండ భారతావని ఇప్పుడు ఒక్క గానొక్క స్తీ గుప్పెట్లో వుంది ఇది ఎవరైనా కాదనగలరా? ఎంతమంది స్త్రీలు కీలక పదవుల్లో లేరు?  మహిళా ముఖ్యమంత్రులు , రాష్ట్రపతులు , సభాపతులు , ప్రతిపక్షనేతలు ఇలా ఎంతో మంది వున్నారు . మరి మహిళా బిల్లును వ్యతిరేఖించే పార్టీల్లో స్త్రీలు లేరా? మరి వారు ఎందుకు ఎదురు తిరగరు? ఎందుకు వారి అధినేతల్ని నిలదీయరు? ఎందుకు ఉద్యమాలు చెయ్యరు? . వర కట్న దురాచారంలో స్త్రీకి పాత్ర లేదా కోడల్ని వేధించే అత్తలు , ఆడపడుచులు స్త్రీలు కారా? కూతుర్ని ఒకలా కోడల్ని మరోలా, కొడుకు చేస్తే ఒప్పు అల్లుడు చేస్తే తప్పు అనుకున్న మహిళా మణులు లేరా? వేరే ఎవరో వాళ్ళ పిల్లల్ని వేదిస్తే అతిగా స్పందించి తమ కొడుకు చేస్తే  " వాళ్ళ వేష భాషల వళ్ళే  మావాడు కామెంట్ చేసాడు లేకపోతె ఎందుకు చేస్తాడు అని కొడుకులు చేసే వెదవ పనులు వెనకేసుకొచ్చే అమ్మలు లేరా? నాన్నలు లేరా? ఎంతమంది లేరు? పసి పిల్లలని చూడకుండా పొట్టి పొట్టి దుస్తులేసి " రింగా రింగా ..లాంటి శృంగార పాటలకు నృత్యాలు చేపించి మురిసిపోయే తల్లులు, తండ్రులు  ఎంతమంది లేరు? వొళ్ళు చూపించటమే అసలైన నాగరికత అన్న చందాన మనుగడ సాగిస్తున్న నేటి సమజం లో స్త్రీ పాత్ర లేదా? "కష్ట సుఖాలు కావడి కుండలు" అన్న తీరున  స్త్రీ పురుషులిద్దరూ సమాజంలో జరుగుతున్న వాటికి సమానంగా భాద్యత వహించాల్సి వుంటుంది . నువ్వంటే నువ్వు అని ఒకరినొకరు వేలెత్తి చూపుకుంటూ పొతే సమస్య మరింత జటిలం కాక మానదు. 

ఒకరు కాదు ఇద్దరు కాదు కర్ణుడి చావుకు అన్నీ కారణాలే అన్నట్లు సినిమాలు , సెన్సార్లు , ప్రభుత్వం , మీడియా అన్ని భాద్యత వహించాలి అంతేకాని నువ్వంటే నువ్వని ఏక పక్ష వాదనలతో స్త్రీ పురుషులిద్దరూ
 చేతులు దులిపెసుకొంటే మాత్రం స్త్రీ రక్షణ ఎప్పటికీ సాద్యం కాదు . స్త్రీ స్వాతంత్ర్యం కూడా ఏ ఒక్క రోజులోనే వచ్చేది కాదు నిరంతరం పోరాటం చేస్తే గాని రాదు . ఒక్క స్త్రీ సమస్యేమిటి ప్రస్తుతం మన దేశంలో చింతపండు ధర తగ్గలన్నా ఉద్యమాలు , నిరశనలు చేస్తే గాని తగ్గని పరిస్థితులు వున్నాయి. ఎన్నో అటు పోటులను ఎదుర్కొన్న స్త్రీ , ఎన్నో వివక్షలను ఎదుర్కొన్న స్త్రీ రాజారాం మోహన్ రాయ్ , కందుకూరి వంటి మహనీయుల చొరవతో మళ్ళి వారి హక్కుల్ని కాపాడుకొని ఈ రోజు పురుషుడితో సమానంగా అన్ని రంగాల్లో తన ఉనికిని చాటుకుంటూ, తన ఉన్నతికి బాటలు వేస్తూ సాగుతుంది . కాని వంటరిగా ఆడది రాత్రులే కాదు పగలు కూడా నడిచే సందర్బాలు ఎదురవుతున్నాయి .

పరిష్కార మార్గాలు

>దీన్ని మన అతి పెద్ద సామాజిక సమస్యగా గుర్తించి ఆడ మగ అన్న బేదం లేకుండా నైతిక జీవనం సాగించేటట్లు కృషి చెయ్యాల్సిన అవసరం వుంది.
>ఏదో
  డిల్లీ వంటి అతి పెద్ద సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ మిగతా సంఘటనల విషయంలో మిన్నకుండి పోకుండా మహిళా సంఘాలు , ప్రజాసంఘాలు, స్వచ్చంద సంస్థలు , పార్టీలు పెద్ద ఎత్తున చర్చలు, ఉద్యమాలు జరపాల్సిన అవసరం వుంది .
>తల్లిదండ్రులు ఎంతటి పని ఒత్తిడిలో వున్నా కూడా
 పిల్లల ప్రవర్తనా  సరళి చిన్నప్పటినుండే పరిశీలిస్తూ  వారిలో నైతికతను , సమస్యలను ఎదుర్కొనే ధీరత్వాన్ని నింపటానికి కృషి చెయ్యాలి .
>ఇరుగుపొరుగు వారిని చూసి పోటి తత్వాలకి పోకుండా పిల్లలకి ఆశక్తి లేని రంగాల్లో కాకుండా వారి ఇష్టా ఇష్టాలను కూడా గమనించి ఆ దిశగా వారిని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత వుంది .
>ఈనాడు చాలా మంది విద్యార్ధులు ఆశక్తి లేని చదువుల్లో రాణించలేక ఇటు
  తల్లిదండ్రుల వత్తిడి అటు విద్యాలయాల వత్తిడులు తట్టుకోలేక కొంత మంది ఆత్మ హత్యలు చేసుకుంటూ వుంటే మరికొంత మంది ఉన్మాదులుగా నేర ప్రవుత్తి స్వభావాన్ని అలవర్చు కుంటున్నారు.
>కేవలం తల్లిదండ్రులే కాకుండా
  ప్రభుత్వాలు, విద్యాలయాలు, మీడియా  సమాజం అందరూ సమిష్టిగా ఇది ఒక సామాజిక భాద్యతగా గుర్తించి తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతయినా వుంది . అభివృద్ధి నాగరికత పేరుతో మితి మీరుతున్న పాచ్చ్యాత్య పోకడలకు అడ్డుకట్ట వేసి భారతీయతను , దేశభక్తిని , సామాజిక స్పృహను , భాద్యతను పెంపొందించాల్సిన ఆవశ్యకత ఎంతయినా వుంది .
> ముఖ్యంగా స్త్రీ పురుషుల సంబందాలు మెరుగుపడాలి ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ నుండే మార్పు సాకారం కావలి దానికి మూల వ్యక్తులు
  భార్య భర్తలే కాబట్టి కుటుంబ వ్యవస్థ అనేది పటిష్టం కావాల్సిన అవసరం ఎంతయినా వుంది ఎందుకంటే నేర ప్రవుత్తి అనేది ఒక మంచి పెంపకం లేకపోవటం , తల్లిదండ్రుల ప్రేమ రాహిత్యం , నిరాదరణే  కారణం అని మానసిక నిపుణుల అధ్యయనాలు చెబుతున్నాయి .
> రోజు రోజుకు పెరుగుతున్న విడాకులు వలన పిల్లలు తీవ్రమైన నిరాదరణకు ఒత్తిడికి గురి అవుతున్నారు
 అనేది జగమెరిగిన సత్యం భార్యా భర్తలు మనస్పర్ధలు వచ్చినపుడు కోర్టులు చుట్టూ తిరగకుండా ఒక అనుభవజ్ఞులు అయిన మానసిక నిపుణులు (మారేజ్ కౌన్సలర్స్ ) దగ్గరకు వెళ్ళి కౌన్సుల్లింగ్ తీసుకోవటం అనేది ఉత్తమమైన మార్గం .

ఒక మంచి సమాజం మంచి వ్యక్తులు వలన నిర్మితమైతే ఒక మంచి వ్యక్తి ఒక మంచి కుటుంబం నుండి తాయారు అవుతాడు . కుటుంబానికి స్త్రీ పురుషులు రెండు చక్రాలు కాబట్టి ఒక మంచి కుటుంబ వ్యవస్థ దిశగా
  ప్రతి స్త్రీ పురుషుడు నిరంతరం కృషి చెయ్యవలసిన అవసరం ఎంతయినా వుంది .

No comments:

Post a Comment